- ఇరిగేషన్, టూరిజం శాఖలు సమన్వయంతో పనిచేయాలి
- ఆఫీసర్లకు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
- అసెంబ్లీ కమిటీ హాల్లో ఉన్నతస్థాయి సమీక్ష
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగవంతం చేయాలని, ఇరిగేషన్, టూరిజం శాఖలు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న నిధులు, ప్రాజెక్ట్ పనులకు ఎదురవుతున్న అడ్డంకులపై ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రాజెక్టు గ్రౌండ్ రిపోర్టులపై ఆరా తీశారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ... పనుల్లో జాప్యాన్ని నివారించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ, అంచనా వ్యయం వంటి అంశాలపై ఇరిగేషన్, టూరిజం శాఖల వారీగా స్పష్టమైన నివేదికలు ఇవ్వాలని సూచించారు.
మానేరు రివర్ ఫ్రంట్ పనులను త్వరలోనే మంత్రుల బృందం స్వయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్టు కీలకమని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, టూరిజం శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫస్ట్, సెకండ్ ఫేజ్ పనులపై చర్చ
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి డీపీఆర్ ఎప్పడు సిద్ధమైంది ? అంచనా వ్యయం ఎంత ? టెండర్లు ఎప్పడు పిలిచారు ? పనులు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు ? అని మంత్రులు ప్రశ్నించగా.. ఎన్జీటీలో కేసు పెండింగ్, ఇతర కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయని అధికారులు వివరణ ఇచ్చారు.
మొదటి దశలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చెక్‌డ్యామ్, బ్యారేజీ, ప్రొటెక్షన్ వాల్స్‌కు సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయని ఆఫీసర్లు తెలిపారు. అలాగే బండ్ నిర్మాణానికి మరో 2.6 ఎకరాల భూమి అవసరముందని, ఇందుకు సంబంధించి భూసేకరణ చేయాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రెండో దశలో ఎక్కువగా టూరిజం శాఖ పనులు చేయాల్సి ఉందని, అవి ఇంకా మొదలు కాలేదని వివరించారు.
ఇరిగేషన్ శాఖ పనుల తర్వాత టూరిజం శాఖ ఆధ్వర్యంలో బోటింగ్, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, ఫౌంటేయిన్లు, ఆడిటోరియం, మ్యూజియం, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ప్లవర్, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగ్స్ వంటి పనులు పనులు త్వరగా చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. అలాగే డ్రైనైజీకి రూ.84 కోట్లు, 19 ఎకరాల భూసేకరణకు రూ.120 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
డంప్‌యార్డుకు మరో చోట భూమి కేటాయించి.. మానేరు తీరంలోని డంపింగ్ యార్డులో చెత్త పోగు కాకుండా చూడాలని మంత్రులు ఆదేశించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం గతంలో టూరిజం శాఖ నుంచి రూ.100 కోట్లు కేటాయించగా.. ఆ మొత్తాన్ని రూ.151 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.
